ఉషశ్రీ సుసంధితమైన చాపం నుండి…

1
113

ఎవరి వ్యక్తిత్వానికైనా మూడు మూర్తులు, ఒకటి తన మనస్సులో అంచనా వేసుకునేదీ, ఇతరులు తన్ను గూర్చి భావించేదీ, మూడవది తన్ను తానే సమష్టి అవచేతనం లోంచీ, త్రవ్వుకుని చూచుకోవడం. అయితే రెండవది బహుముఖమైంది. ఎంతమంది అంచనా వేస్తే అన్ని మూర్తులు, అన్నింటిలో ఎంతో వైవిధ్యం, వైరుధ్యం. విశ్వసిస్తే బహుజన్మ పరంపరల నుంచీ వాసనా సంపుటినీ కర్మసంచయాన్నీ మోసుకు వచ్చే జీవుడు తన చైతన్యం మీది ముద్రలని ఎన్నని లెక్కపెట్టగలడు? ఏ ముద్ర ఎప్పుడు మేల్కొంటుందో ప్రవృత్తిలో ఏ అనూహ్య క్రియకు కారణమౌతుందో ఎలా చెప్పగలం.

అయితే మానవ ప్రవృత్తిలోని సంక్లిష్ట లక్షణం మనోలోకంలోని రహస్య ద్వారాలు తెరుచుకున్నా తనకు తానే అర్థం కావడం కష్టం. అందుకే సంప్రదాయం చెప్పింది, ప్రవృత్తిని కత్తివాదర మీద నుంచి నడిచే వాడిలాగా జాగరూకతతో రక్షించుకోవాలని, జారుపాటు ఏ క్షణంలో కలిగినా పతనమే. “ఇది ఏనాటికి ఏమగున్‌ తెలియదోయీ రామ! ఎన్నేండ్లుగా బ్రతుకో అన్ని సమల్‌, నెలల్‌, దినము, లిప్తన్‌, లిప్త, రక్షింపగా” తుద ఎప్పుడు! ఏ అజాగ్రద్వేళలో! ఏ మోహమో! ఏ లోభమో! కాలుబట్టి లాగవచ్చు. మన చైతన్యంలో ఈ స్పృహ జాగ్రత్త ఎప్పుడూ మేల్కొని ఉంటే పతనం పొందే అవకాశం తగ్గిపోతుంది. మాన్యుడైన ఉషశ్రీ వ్యక్తిత్వంలో ప్రచురమూ, ప్రకటితమూ అయిన వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వ రక్షాస్పృహ కలది. “జగదుషోవేళా ప్రసన్న వాగ్దేవత అకాశమున లాస్యమాడినపుడు” అర్ష కంఠాలలో మ్రోగిన ఉషస్సూక్తాలనుంచీ ఈనాటి జిడ్డు కృష్ణమూర్తి అంతర్ముఖ సమారాధ్యమూ, బహిర్ముఖ సుదుర్లభమూ అయిన వాగున్మేషం దాకా ఆయన చైతన్య సంపుటిలోకి ప్రవేశించిన పదార్థాలే.

ఈనాడు దేశంలో మానవుడు క్షుభితుడై, ఆత్మ విశ్వాసం కోల్పోయి కుంచితుడై ప్రాచీనాధునిక జీవన పరిస్థితుల ఘర్షణలో శిథిలుడై అరక్షితమైన వ్యవస్థలో నిత్యభీతుడై ఉండగా ఉషశ్రీ ఆ సంక్షోభంలోనించి ఉద్గమించి రెండు దశాబ్దాలుగా ఒక మూల వ్యవస్థను గూర్చి దానిలోని అభయస్థితిని గూర్చీ సార్వకాలికతను గూర్చీ ఉపదేశిస్తున్నాడు. ఈ ప్రవక్తృ లక్షణం తనంత తాను ఎంచుకొన్నది కాదు. తానూ ఇన్ని ఒత్తిళ్ళకూ మనస్సులో రాపిడి పొందినవాడు. ఉద్యోగం లేకా; యజమానుల చేత అకారణ బాధలూ పొందినవాడు. ఆకలీ, దారిద్య్రం ఎరిగినవాడు. ఆ బాధలలోంచి ఒక ‘కటు’ లక్షణం వాక్కులో పెంచుకున్నవాడు. దానితో ధీర ప్రవృత్తి వచ్చింది. వ్యాస వాల్మీకుల కథా కోశాలనుంచి తాను పునరుజ్జీవనం పొందాడు. తనకు తెలియకుండానే తాను ఆధునిక పౌరాణికుడూ, వర్తమానస్థితికి వ్యాఖ్యాతా అయినాడు. తాను పుట్టింది పురాణపండవారి శ్రోత్రియ కుటుంబంలో, అయితే తానూ పౌరాణికుడు కావాలని అనుకోలేదు. భీమవరంలో చదువు అఖండంగా సాగిస్తూ కవీ, కథకుడూ, నాటక కర్తా అయినాడు. 1952 నాటికే ‘విశ్వశ్రీ’ పత్రిక స్థాపించాడు. ‘విశ్వనాథ’ ప్రత్యేక సంచిక ప్రకటించి సాహిత్యరంగంలో అపూర్వ సంచలనం సృష్టించాడు. ఆ సందర్భంలో జరిపిన దేశాటనంలో సాహిత్యరంగంలోని అనేకులైన పెద్దల వ్యక్తిత్వంలోని వెలుగు నీడలను దర్శించాడు.

***

రంగం హైదరాబాద్‌కు మారింది. ఉద్యోగాలు చాలా మార్చి పత్రికా రచయిత అయినాడు. చివరకు రేడియో ఉద్యోగం. అప్పటికి పిల్లలు, సంసారం! ఎలాగో ఆ ఉద్యోగంలో కుదురుకున్నాడు. ఉషశ్రీ ఉద్యోగం చేస్తూ ఎప్పుడూ తలవంచలేదు. అన్యాయంతో పొత్తు గలపలేదు. విజయవాడ రేడియోలో ఆయన చేరిన తరువాత క్రమంగా ఆయన వ్యక్తిత్వంలో వక్తృ, ప్రవక్తృ లక్షణాలు విచ్చుకొన్నాయి. రేడియో కార్యక్రమాలకు రంగూ, రుచీ, వాసనా వచ్చాయి. ఉషశ్రీ గొంతు శ్రోతలకు ఒక ఆకర్షణ. దానిలో మార్దవం లేదు. అయినా ఆ ధీరత్వం, వాడీ, నిశితమైన వ్యంగ్యం. అంతకు పూర్వం ఆ ప్రభుత్వ సంస్థలో లేనివి. ఉషశ్రీకి రేడియో చాలలేదు. ఆయన వ్యక్తిత్వం ఎదిగింది. ఆయనకు తెలుగు దేశమంతా వేదిక అయింది. ఎన్నివేల ఉపన్యాసాలో, ఎన్ని వక్రోక్తులో! దేశం ఈ అరుదైన వ్యక్తిని తన గుండెల్లో పొదువుకున్నది. సుసంధితమైన చాపం నుంచి సూటిగా లక్ష్యం వైపు దూసుకుపోయే బాణం లాంటి ఉషశ్రీ వాక్కు ఎందరికో ధర్మ సందేహాలు తీర్చింది, జీవిత గ్రీష్మాతపంలో తప్తులైన వారికి ఎందరికో దప్పిక తీర్చింది. ఇప్పుడు మనం చూడవలసింది ఆయన చెప్పేది రామాయణమా, భారతమా, మరొకటా అని కాదు. ఆ మూసలో జనానికి ఆయన అందించే ఆత్మ విశ్వాసం పాలెంత అని. స్తబ్ధమైన జనంలో అభీతిని కలిగించి కర్తవ్యోన్ముఖులను చేయడంలో ఆయన ప్రసంగాల పాత్ర ఎంత అని! పురోగామి ప్రతీగామి శబ్దాలను పడికట్టు రాళ్ళలాగా వాడకపోతే ఆయన కృషి ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించిందనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here