భూమి, గుండ్రంగానే ఉందిగా మరి..!

0
115

అక్కడ… ఆ అరుగుమీద
కొన్ని నలిగిపోయిన
రంగు వెలిసిపోయిన జీవితాలు
గతం పేజీలు మెల్లమెల్లగా తిప్పుకుంటూ
”ఆ రోజుల్లో”… అంటూ ఆనందంగా
ముచ్చటించుకుంటుంటాయి
ఆడుకుంటున్న బొమ్మల పెట్టెను సర్దేసి
కర్రాబిళ్ళా, క్రికెట్ బ్యాటు, గోళీకాయల్ని
ఓ పక్కన జాగ్రత్తగా దాచేసి
వాళ్ళ మధ్యన చోటుచూసుక కూచుంటావు
“మా రోజుల్లో” … అంటూ నీకేసి చూస్తూ
చెప్పేమాటల్ని ఆసక్తిగా వింటుంటావు
వాళ్ళకేసి అమాయకంగా చూస్తుంటావు

భవిష్యత్తు మోహపు వలలో చిక్కుకుని
చదువులంటూ పదవులంటూ
పెళ్ళిల్లంటూ పిల్లలంటూ
కొత్త సంబంధాలు కలుపుకుంటూ
పాత బంధాలను సుతిమెత్తగా తప్పిస్తూ
చప్పడు కాకుండా తెంచేస్తూ
బాధ్యతల బరువును
ఇష్టంగానో అయిష్టంగానో మోస్తుంటావు
ఆశల ఎరలు వేస్తూ ఆహ్వానిస్తున్న
బంగరువన్నెల బతుకు బాటలో
వెనక్కి చూడకుండా
ముందుకెళుతూనే ఉంటావు
వెనుక నుండి వినపడుతోన్న
ముసలి పిలుపుల్ని వినిపించుకోకుండానే

కాలం నిన్ను ఎక్కడెక్కడో తిప్పి
ఎవరెవరినో కలిపి, ఎందరెందరినో విడదీసి
ఏ ఎత్తుల్లోకో మోసుకెళ్ళి, ఏ లోతుల్లోకో తీసుకెళ్ళి
నీ కండల్ని కరుగదీసి, నీ శరీరాన్ని అరుగదీసి
ఎముకల్ని గుల్లబార చేసి
చర్మాన్ని ముడతల మడతలు పెట్టేసిన
జీవితపు సాయం సమయంలో
తిరిగి తిరిగి, వెనుతిరక్కుండా తిరిగి తిరిగి
మళ్ళీ ఆ అరుగు దగ్గరకే వస్తావు
ఆ బొమ్మలపెట్టె తెరుస్తావు
భద్రంగా దాచుంచిన నీ ఆటసామగ్రినీ
బయటకు తీస్తావు

రంగు వెలసిన ఆ బొమ్మల నీరసపు పలకరింతలో
విరిగి మక్కలై, చెదపట్టి చేవకోల్పోయిన
నీ ఆటసామగ్రి అలసటనిండిన ఆహ్వానంలో
ఏవో జ్ఞాపకాలను వెదుక్కుంటూ ఉంటావు

ఆహ్వానిస్తున్న అరుగుమీది ముఖాల్లో
పాత ముసలి ముఖాలేవీ ఉండవు
నీ బాల్యాన్ని పంచుకున్న సహచరుల
ఆనవాళ్ళు ఆ ముఖాల్లో పసిగడతావు
ఆనందంగా
అరుగుమీది ఏదో ఓ ఖాళీని ఆక్రమిస్తావు
గతం పేజీలను తెరుస్తూ చదువుతుంటావు
జరిగిపోయిన ఘటనలను
ఓ పద్ధతిగా చర్చిస్తుంటావు
అటూ ఇటూ చూసి
ఎవరో ఒక పసివాణ్ణి దగ్గరకు తీసుకుని
“ఆరోజుల్లో…! మా రోజుల్లో…!”అంటూ
నువ్వూ చెప్పడం మొదలెడతావు

ఎందుకంటే..?
భూమి…!
భూమి, గుండ్రంగానే ఉందిగా మరి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here