నీలమత పురాణం – 41

1
115

కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.

బ్రహ్మ ఆదేశాలను అనుసరించి దేవతలు తమ తమ నిర్దేశిత కర్తవ్యాలు నిర్వహించటానికి వెళ్ళిపోతారు.

ఇకపై మళ్ళీ సంవత్సరమంతా జరపవలసిన పూజలు, విధానాల వివరణ ఆరంభం అవుతుంది.

చైత్రమాసం శుక్లపక్షం అయిదవ రోజున శ్రీదేవిని పూజించాలి. దీన్ని ‘శ్రీ పంచమి’ అంటారు. నిజానికి చైత్రమాసం అయిదవ రోజు అని ప్రత్యేకంగా చెప్పటం ఎందుకంటే అయిదవ రోజు అత్యంత పవిత్రమైనది. కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా పూజలు చేయాలి. ఎవరయితే మిగతా అయిదు రోజులూ లక్ష్మీ పూజ జరుపుతారో, తమ జీవితకాలమంతా లక్ష్మీదేవిని పూజిస్తూ గడుపుతారో, మరణం తర్వాత వారు విష్ణులోకాన్ని పొందుతారు.

స్కంధుడిని సుగంధ పుష్పమాలలతో, ఆభరణాలతో, వస్త్రాలతో, గంటలతో, కోళ్ళు, మేకలు, బొమ్మలతో పూజించాలి. రుచికరమైన భోజ్యపదార్థాన్ని నైవేద్యంలా అర్పించాలి. చైత్రమాసం ఆరవ రోజున పూజలు జరిపి సంబరాలు జరుపుకున్న వారి ఇంట్లో అందరూ సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉంటారు. తొమ్మిదవ రోజున పవిత్రుడయి శుచి, శుభ్రతలతో ఉపవాసం ఉండాలి. రోజంతా భద్రకాళిని పూలతో, సుగంధ ద్రవ్యాలతో, ధూపదీపాలతో, నైవేద్యాలతో పూజించాలి. నిజానికి భద్రకాళిని తొమ్మిది రోజూలూ పూజించాలి. కానీ తొమ్మిదవ రోజు ప్రత్యేకంగా, తప్పనిసరిగా పూజించిన వారు చేపట్టిన ప్రతీ పని విజయవంతం అవుతుంది.

చైత్రమాసం శుక్లపక్షం 11 వ రోజున గృహదేవతను, ఇష్టదేవతను పూజించాలి. పూలు, ఆభరణాలు, ధూపం, పలు రకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో పూజించాలి. అగ్నిని, బ్రాహ్మణులను అర్చించాలి.

పన్నెండవ రోజున ఉపవాసం ఉంటూ వాసుదేవుడిని పూజించాలి. 13వ రోజున వస్త్రంపై తీర్చిదిద్దిన కామదేవుడిని ఉచితరీతిన పూజించాలి. వ్యక్తి తనను తాను అందంగా అలంకరించుకుని, ఇంట్లోని ఆడవారినందరినీ పూజించాలి. ఇతర పూజలు, వ్రతాలు చేసినా చేయకున్నా ఈ పండుగను మాత్రం తప్పనిసరిగా జరుపుకోవాలి.

కశ్మీరు ప్రాంతాలన్నీ ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థలో ఉండేవంటారు. ఇప్పటికీ లఢాఖ్ ప్రాంతాలలో మాతృస్వామ్య వ్యవస్థ చలామణిలో ఉందంటారు. నీలమత పురాణంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వటమే కాదు, పలు సందర్భాలలో వారిని తప్పనిసరిగా పూజించాలని నొక్కి చెప్పటం కనిపిస్తుంది.

13వ రోజున చల్లని నీటిని కలశంలో తీసుకుని దానిలో పూలు, ఆ పూలతో అలంకరించాలి. సూర్యోదయానికి ముందే ఆ కలశాన్ని కామదేవుడి ముందు ఉంచి పూజించాలి.  ఆ తరువాత సూర్యోదయం కాకముందే భర్త ఆ కలశంలోని నీటితో భార్యను తన స్వహస్తాలతో స్నానం చేయించాలి.

శృంగారాన్ని భక్తితో కలపడం కనిపిస్తుందిక్కడ. భార్యాభర్తల శృంగారం పవిత్రకార్యమే. అది ఒక పూజనే. పూజలో భాగమే.

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాలి.

పలు కారణాల వల్ల  కామం అంటే sexual desire అన్న అర్థం స్థిరపడింది. కామం అన్నది లైంగికార్థంలోకి చలామణిలో ఉంది. కానీ ఎవరిపై పడితే వారిపై కలిగే కోరికకూ కామదేవుడు కలిగించే కామానికీ తేడా ఉంది.

కామదేవుడు ధార్మికమైన కోరికనే కలిగిస్తాడు. ధర్మమైన కామానికి కామదేవుడు కారణం అవుతాడు. పశుతుల్యమైన భావనకు కామదేవునితో పనిలేదు. అది జంతు ప్రవృత్తి. అందుకే కామదేవుడు మనుషులకు అవసరమయ్యాడు.

జంతువులు ప్రకృతి ప్రకారం ప్రవర్తించే జీవులు. వాటిలో కామ ప్రచోదనలు ఎప్పుడు పడితే అప్పుడు కలగవు.  వాటికి ప్రత్యేకమైన ప్రకృతిబద్ధమైన కాలం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు వాటిలో లైంగిక ప్రచోదనలు కలుగుతాయి. వాటికి కలిగే తీవ్రమైన సంభోగ భావన ప్రాకృతికం. ఆ ప్రాకృతిక భావన వెనక ‘సంతానోత్పత్తి’ అనే లక్ష్యం అంతర్లీనంగా ఉంటుంది. అందుకే ధర్మశాస్త్రాలు సంతానోత్పత్తి లక్ష్యంతో జరిపే లైంగిక చర్యను ‘ధర్మబద్ధం’గా భావిస్తాయి.

సంతానోత్పత్తి భావన మౌలిక భావన. దానికి ప్రేరేపణలు, ఉద్దీపనలు అవసరం లేదు. ఆ పని ప్రకృతి సహజంగా చేస్తుంది. ప్రకృతి లోనే నిబిడీకృతమయి ఉందీ భావన. సమయం వచ్చినప్పుడు పుప్పొడి గాల్లోకి ఎగురుతుంది. విత్తనాలు వాటంతట అవే ఫటేల్మని పేలి బీజాలను వెదజల్లుతాయి. పశువులు తోడును వెతుక్కుంటాయి. మనిషి ఇందుకు భిన్నం కాదు. కానీ కొన్ని సందర్భాలలో లోకకళ్యాణం కోసం వ్యక్తిలో లైంగిక భావనలు కలిగించాల్సిన అవసరం వస్తుంది.  లోకకళ్యాణానికి అది అవసరం. అలాంటి సమయాలలో కామదేవుడు అవసరం అవుతాడు. ఎందుకంటే, అలా ప్రత్యేకంగా కలిగించే కామభావనలోని ధార్మికతను గుర్తించి, దాని వల్ల జరిగే ప్రయోజనాన్ని తెలుసుకుని ధర్మబద్ధమైన రీతిలో ఆ భావనను కలిగించే దైవం కామదేవుడు. ఎప్పుడు బడితే అప్పుడు, ఎక్కడబడితే అక్కడ, ఎవరిపై పడితే వారిపై కలిగే కోరికతో కామదేవుడికి సంబంధం లేదు. అది పశుభావన. దానికి దైవం అవసరం లేదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here