కైంకర్యము-51

0
112

ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి.

[అలకనంద అవతల ఉన్న చరణపాదుకల గురించి మేనేజర్ చెప్పిన విషయాన్ని ప్రసన్నలక్ష్మికి చెప్పి, అటు వెళదామా అని అడుగుతాడు రాఘవ. తనకి నడుము నొప్పిగా ఉందని, అతన్ని వెళ్ళమని చెబుతుంది ప్రసన్నలక్ష్మి. అక్కడికి వెళ్తాడు రాఘవ. ఆ పవిత్రమైన ప్రదేశంలో అతని మనసు శాంతిని పొందుతుంది. అత్యద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. ధ్యానంలో కూర్చుంటాడు. హఠాత్తుగా ఎవరో తనని చూస్తున్న భావన కలిగి కళ్ళు తెరుస్తాడు రాఘవ. ఎదురుగా గొప్ప వర్చస్సుతో ఉన్న యతి ఒకరు కనబడతారు. ‘ఏమైనా గుర్తొచ్చిందా’ అని రాఘవని అడిగి, “అంతా సర్దుకుంటుంది, ఆశ్రమానికి రండి” అని చెప్పి వెళ్ళిపోతారాయన. ఇన్ని రోజులు ఎన్నో ప్రదేశాలలో, ఎన్నో క్షేత్రాలు తిరిగినా నెమ్మదించని మనస్సు అలా ప్రశాంతంగా మారే సరికి చాలా ఆశ్చర్యమేస్తుంది రాఘవ. యతుల పట్ల గతంలో లేని గౌరవాభిమానాలు కలుగుతాయి. దాదాపు నెలన్నర తరువాత హైదరాబాదు చేరుకున్నారా దంపతులు. ఇంటికి చేరుతూనే ప్రసన్నలక్ష్మి తల్లికి అనారోగ్యమని తెలిసి వెంటనే పుట్టింటికి బయల్దేరురుతుంది ప్రసన్నలక్ష్మి. వారం తర్వాత తాను వస్తానంటాడు రాఘవ. – ఇక చదవండి.]

రాఘవకు రోజు రోజుకు ఊపిరి ఆడనట్టుగా ఉంది. లోలోపల ఒక సెగ మొదలయింది.

అతని దృష్టి దేని మీద కుదరటం లేదు. బలవంతంగా తింటున్నాడు. మిగిలిన సమయం ఆ యతిని తలుచుకుంటూ కళ్ళు మూసుకు కూర్చుంటున్నాడు.

ఆనాడు సుదర్శనాచారి పిలిచాడు.

ఆఫీస్ గదిలోకి వచ్చాడు రాఘవ. అక్కడే రామచంద్ర కూడ ఉన్నాడు. అతను దేనికో వెలిగిపోతున్నాడు. సుదర్శనాచారి కూడ చాలా రిలాక్సుడుగా కనిపించాడు.

“మీ పూర్వ ఎండి కాల్ చేశాడురా..” అన్నాడు.

“ఏంటిట? మీరు డబ్బు కట్టానన్నారుగా..”

“డబ్బు వాపస్ పంపుతున్నాడు..”

“వాట్..”

“అదే. ఎవరో మిస్‌చీఫ్ చేసినవాడు వచ్చి తన క్రైమ్ ఒప్పుకున్నాడట. ఎందుకు ఒప్పుకున్నాడు? అని అడిగితే వాడికి ఏదో గిల్టీ ఫీలింగ్ పట్టుకు పీడిస్తోంది అన్నాడట. వెరీ అన్యూజ్యువల్..”

“వాట్..”

“అది కాక అసలు మనీ ఏదీ ఎవరు తీయలేదు. వాడు జస్టు ఒక డిజిట్ యాడ్ చేస్తూ పోయాడట అకౌంట్స్‌లో. మీ ఎండి చాలా సేపు మాట్లాడాడు. రాఘవకు చాలా సారీ చెప్పండి అన్నాడు. నీకు అఫీషియల్‌గా లెటర్, జాయిన్ అవమని పంపుతామన్నారు..” అన్నాడాయన.

“అవును రఘు. నా సర్వీస్‌లో ఇంత వింతైన విషయం చూడలేదు..” చాలా ఎగ్జైట్ అవుతు చెప్పాడు రామచంద్ర.

“మరి నాకు జరిగిన డామేజ్‌కు?” అన్నాడు రాఘవ.

“దాని గురించే కాల్ చేసిందాయన అసలు. మనం కేసు వెయ్యద్దు అని, నీకు వీపి ఆఫర్ చేస్తున్నారురా..”

“అవును రఘు. ఇది మంచి ఆఫర్, నీ కెరీర్‌కి. తీసుకో!”

“నేను ఆలోచించుకోవాలి..” లేచి వచ్చేస్తు అన్నాడు రాఘవ.

అతని మనస్సులో మళ్ళీ చరణపాదుకల వద్ద సన్యాసి అన్నమాటలు గుర్తుకు వచ్చాయి. ‘అంతా బాగవుతుందిలే.. అంటే ఇదేనా? ఇదేనా నేను కోరుకున్నది?’

‘రెండు నెలలు తిండి మానేసి, నిద్రలేకుండా రాత్రులు దీని కోసమే తను నలిగిపోయిందా?

ఇదేనా నేను కోరుకున్నది??’ అంటు నలిగిపోయాడు రాఘవ.

అతనికి రెండు రోజులు అసలు తిండి సహించలేదు. సుదర్శనాచారి కూడా చూస్తున్నాడు అతని సంఘర్షణ.

“నీ యాత్రల ఫలం నీకు దొరికింది. నీ సమస్య తీరిందిరా..” అన్నాడాయన.

తండ్రిని చూస్తూ “నేను తప్పేమీ చెయ్యలేదు నాన్న. నాకు తెలుసు ధర్మందే విజయమని..”

సుదర్శనాచారికి వింతగా తోచింది అతని ప్రవర్తన.

అతనికి తన మామయ్య దీవెన గుర్తుకు వచ్చింది.

పెళ్ళిలో అందరు రకరకాలుగా దీవిస్తుంటే ఆయన మాత్రం “ధర్మం తప్పకు నాయనా! ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది..” అన్నాడు.

ఆ విషయం గుర్తుకొచ్చింది.

ఆయన ధర్మనిష్ఠ, తపస్సు, పరుల సొమ్ము అంటకపోవటం, పరుల పంచన భోజనం చెయ్యకపోవటం, నిత్య అగ్నిహోత్రం, నిత్య అనుష్ఠానం, సదా అష్టాక్షరి జపం ఇవన్ని ఆయన్ని అందరికి వేరు చేస్తాయి. ఆయన వర్చస్సు అది గుర్తుకు వచ్చింది. ఆయన ఆహార్యం మాములుగా ఉంటుంది. పైగా కొద్దిగా చిరిగి కూడ ఉంటాయి బట్టలు. ఆయన కాని, సీత కాని అది పట్టించుకున్నట్లు ఉండరు. వారిదో సంస్కారం. బీదరికమే పరమాత్మను దగ్గర చేస్తుందని నమ్మకం. ధనం ఆయనను మన నుంచి దూరం చేస్తుందని అనుకుంటారట. ప్రసన్నలక్ష్మి చెబితే రాఘవ ఆశ్చర్యపోయాడు ఇలాంటి వాళ్ళు ఉంటారా? అని. అది అతనికి ఇప్పుడర్థమవుతోంది.

వీపి పోస్టు, మళ్ళీ ఫ్యాక్టరీ, వర్కర్స్, కొందరి మెప్పు, కొందరి అసూయ, అన్నలు వదినలు, నాన్న అమ్మ, ప్రసన్నలక్ష్మి అతనికి తల తిరిగిపోతోంది.

‘ఏమిటి కావాలి నాకసలు?’ అంటూ ప్రశ్నించుకుంటున్నాడు లోలోన.

ఇది తిరిగి తిరిగి మళ్ళీ ఆ యతి దర్శనం కలిగింది కలలో.

తనకు కావలసినదేదో తెలిసింది.

ఇక ఆలోచించలే రాఘవ.

లేచి ఒక బ్యాగ్ తీసుకొని అందులో ఒక జత మాత్రం బట్టలు పెట్టుకొని బయటకు నడిచాడు.

“ఏందాకరా?” అంది ఆండాళ్లు.

బహుశా అత్తగారిని చూసిరావటానికి బయలుదేరాడేమో అనుకుంది.

“అమ్మా మన కులగురువు దగ్గరకు వెళుతున్నాను. మళ్ళీ తప్పక వస్తాను. నీవు కంగారు పడకు…” అంటు ఆమె కాళ్ళకు మ్రొక్కాడు.

“అహోబిళం వెళతావా?” అందామె ఏమనాలో తోచక.

అతను మౌనంగా తల ఊపి ఇంటి బయటకు నడిచాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here