ఆశాభావంతో నూత్నత్వానికి స్వాగతం పలుకుతున్న కోగంటి విజయకుమార్ కవిత “ఇంకా ఆలస్యం ఎందుకు?”.
తేనెగొంతుల దేవతల
కువకువలతో
మత్తెక్కుతూ
నిదురలేవాలని చూస్తోంది
యీ వుదయం
పరిమళించే
తారకలను పూయిస్తున్నై
చామరాలైన
వేపకొమ్మలు
కొత్తరాగాన్ని
చుట్టుకునేందుకు
సిద్ధమౌతోంది
చిగురించే మనసు
గంపెడు బిడ్డల్ని
ఎత్తుకున్న
అమ్మలా నవ్వుతోంది
మామిడిచెట్టు
మరో వత్సరపు
పలకరింతల చిరునవ్వౌతూ
పలకరిస్తోందీ కోయిల
కొత్త ఆశలతో
తెరిచిన గుండెనిండా
వసంతాన్ని నింపేందుకు
ఇంకా ఆలస్యం ఎందుకు
-డా. విజయ్ కోగంటి




