గొంతు లేని మాట

0
121

కడుపు నిండింది
కానీ పళ్ళెంలో
చెల్లాచెదురైన జ్ఞాపకాల్లా మెతుకులు
అన్నీ కలిపితే గురుతుల ముద్దైంది
వేళ్ళతో కౌగిలించుకున్నాడతను

నాకు ఆకలిగా లేదు
అమ్మ ఎప్పుడూ చెప్పే అబద్ధమిప్పుడు
వేళ్ళ సందుల్లోంచి వినపడింది
గొంతు లేని మాటలు గుండెల్ని గిల్లుతాయి
అందుకే
ఆ అబద్దాన్ని చూడాలనిపించింది
వెంటనే మరో చేయి
సెల్ ఫోన్ స్క్రీన్ మీద వేగంగా కదులుతుంది..
తల్లి ఫోటో కోసమీ దేవులాట

హోమ్ వుంది.. వాల్స్ ఉన్నాయి..
ప్రపంచమే ఉంది..
అమ్మెక్కడ?!
అప్పుడర్థమయ్యింది
తన ప్రపంచంలో అమ్మ లేదని

“అంత కర్కోటకుడివేమీ కాదు..”
లైక్స్ మధ్యన ఇరుక్కున్న
మదర్స్ డే సెల్ఫీ చిన్నగా చెప్పింది

గుండె ఎప్పుడూ తడే
కాకపోతే కొంచెం వేడీ కావాలి
ఇప్పుడులా…
సూక్ష్మ తెర వెనుక ముడతల కొవ్వొత్తి
ఇంకా ప్రేమ విరచిమ్ముతూ
మోంటెజీలో మెత్తగా ప్రవహిస్తోంది.
గుండె గోడలు రాసుకుంటూ
కళ్ళల్లో ప్రక్షేపణమవుతోంది
ఆ కాంతి కణాలు నదిని పొలార్చాయి
రెప్ప గోడని దూకిన యేరు చూస్తుండగా
ఈ సారి ఆ చెయ్యి
ప్రపంచాన్ని పక్కకి తోస్తుంది
స్క్రీన్ మీద
Calling..
Amma

సంతృప్తిగా చూస్తూ
ఆ ముద్దకి ముద్దు పెట్టి తిన్నాడు
అమ్మ ముద్ద కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here