భాషకు కాయకల్ప చికిత్స

0
111

శరీరం ఋజాగ్రస్తమైపోయింది సరే. అయినా కాపాడుకోవాలి కదా! అంటే చికిత్సతో క్రమేపీ సాధారణ స్థితికి తీసుకొని రావాలి. అందుకు చాలా ఓర్పు, నేర్పు అవసరం. కాలగతిలో భౌతిక శరీరం అనేక మార్పులకు గురై రోగగ్రస్తమైనట్టే సామాజిక పరిణామాల నేపథ్యంలో ఆచార వ్యవహారాలలో, ధర్మాధర్మాల విచక్షణలో, సామాజిక సంబంధాలలో మంచి, చెడుల ప్రభావమూ త్రోసిపుచ్చలేనిది. కారణం సమాజం గతిశీలమైనదే కాదు, పరిణామ శీలమైనది కూడా. అయితే సమాజ గతిలో ఈ శతాబ్దిలో ఉన్నంత వడి, వేగం మున్నెన్నడూ లేదు. ఆ వేగానికి ఆచారవ్యవహారాలు, ఆలోచనావిధానాలు, వివిధ వడికట్టు పదాలకు నిర్వచనాలు – వంటివే మారిపోతున్నప్పుడు భాష మాత్రం మార్పునకు అతీతంగా ఉండగలదని, ఉంటుందని ఎలా ఆశించగలం? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో ’డిజిటల్ ఇండియా” వంటి లక్ష్యాల ఏర్పాటులో ఆ దిశగా జరుగుతున్న ప్రస్థానంలో ఏ భాషైనా పరభాషాగ్రస్తమవడంలో ఆశ్చర్యమేముంది?

అయితే – మెలకువగా వ్యవహరించినవారు ప్రమాదాన్ని నివారించగలుగుతారు, తొందరగా మేల్కొన్నవారు మార్పును కొంతవరకు నిరోధించగలుగుతారు. అలసత్వంతో ఉన్నవారు ఆలస్యంగా కళ్ళు తెరచినవారు తమ వైఖరికి మూల్యం చెల్లించక తప్పదు మరి. తెలుగు భాష విషయంలో జరిగింది అదే.

నేతల ప్రాధమ్యాలు మారిపోయినట్టే, వ్యక్తుల ప్రాధమ్యాలు మారిపోతున్నాయి. అన్ని విలువలను ఆర్ధికాంశాలే శాసిస్తున్న కాలమిది. బహుళజాతి కంపెనీలలో లక్షల జీతంతో ఒనగూడగల సౌకర్యవంతమైన అత్యంత ఆధునికమైన జీవితం – నేటి సగటు యువత, తలిదండ్రుల కల! ఆ కలల సాకారానికి కావాలసిన సరంజామాలో భాగమే ఈ భాషా సంకరీకరణ.

నిజనికి ఉపాధి కల్పనలో ’నైపుణ్యానికి’ మించిన వినియోగ యోగ్యతకల భాష ఏదీ లేదు. ఏ సమాచార సాధనమూ నైపుణ్యాల స్థానాన్ని పూరించలేదు. వాటికి ప్రత్యామ్నాయమూ కాజాలదు. ఇంత చిన్న విషయాన్ని గ్రహించలేక ఇంగ్లీషే వస్తే ఉద్యోగం గ్యారంటీ, ఇంగ్లీషు రాకపోతే ఉధ్యోగాలు రావు’ వంటి తఫ్ఫుడు ప్రచారాలకు ప్రభావితులౌతున్నారు. పోనీ ఆ భాషనైనా దోషరహితంగా అలవడుతోందా అంటే అదీ లేదు. మాతృభాష అభ్యాసనపు పునాదిలేని పరాయిభాష అభ్యాసం సమగ్రంగా దోష రహితంగా ఎలా అలవడుతుంది?

పరభాషామాధ్యమంలో స్పెల్లింగ్, గ్రామర్ వంటి సౌకర్యణాంశాలతో కుస్తీపట్టే లోపునే/తిప్పలుపడే లోపునే అవి వంటబట్టి భాష రుచి తెలిసే లోపునే లోపలి తృష్ణ అణగిపోతుందని రవీంద్రుడు అనేవారు. బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన – ఆత్మను తాకలేని యాంత్రిక విద్యావిధానాన్ని ఆయన ఆమోదించలేకపోయారు. చిన్నతనంలో విసుగు విరామంలేని, మార్పులేని దినచర్య కారణంగా ఆయనకు బడిలోని విద్యాబోధన/అబ్యాసంపై అనురక్తి ఏమాత్రం కలగలేదు సరికదా ఒక దశలో విసుగు కూడా పుట్టింది. తండ్రి, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా బలవంతంగా కొన్నాళ్ళు స్కూలుకు వెళ్ళినప్పటికీ తన 14వ ఏటనే స్కూలు చదువుకు స్వస్తి పలుకుతూ ‘సెయింట్ క్జేవియర్’ స్కూలుకు వీడుకోలు చెప్పేశారు.

ఒక స్కూలు డ్రాపవుట్ కుర్రాడు భవిష్యత్తులో ఒక విద్యాసంస్థను ప్రారంభించి దాన్ని ప్రపంచ ప్రఖ్యాతి పొందగల విశ్వవిధ్యాలయంగా తీర్చిదిద్దగలడని సమకాలీన మేధావి వర్గాలు మాత్రమే కాదు, బ్రిటిష్ వారు సైతం ఊహించి ఉండరు. తన ఆశయ సాధనలో ఎదురుకాగల కష్టనష్టాలనుగాని, సాఫల్య వైఫల్యాలను గురించిగాని ఆయన పెద్దగా ఆలోచించలేదు. తనవంతు పనిని తాను చేసుకుంటూపోయారు. విశ్వభారతి రూపుదిద్దుకుంది, అంతే!

ఏ ఆశయమైనా అంతే. ఆశయం దిశగా ధృడసంకల్పంతో ప్రయత్నాలు చేస్తూపోతే కొంచెం వెనకోముందో లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు.

అనారోగ్యంతో కునారిల్లుతున్న శరీరాన్ని మోస్తూ వైద్యాన్ని అందిస్తున్నట్లే పరాయిభాషా పదాలతో సంకరమైపోయిన భాషను యధాస్థితిలోనే మనస్ఫూర్తిగా స్వీకరించి పరభాషా పదాల స్థానంలో తెలుగుపదాల ప్రయోగాన్ని క్రమేణా కొనసాగిస్తూపోవాలి. భాష పట్ల మమకారం ఉన్నవారందరూ తమవంతుగా ఆ బాధ్యతను నెత్తినవేసుకొని ఆ ప్రయోగాన్ని వ్యావహారికంలో, బోధనలో, వ్రాతలో అమలు చేస్తూ పోయినట్లయితే మరుగునపడిపోయిన పదాలన్ని తమ స్థానాలను తిరిగి సంపదించుకోగలుగుతాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకు తెలియకుండానే జరిగిపోయిన అనర్థం కొన్ని తెలుగుపదాల అంతర్థానం, వాటి స్థానంలో పరాయిభాషా పదాల వేడుక. ఇది మన నిర్లక్ష్యం వల్ల జరిగిన అనర్థం. దాన్ని దిద్దడానికి మాత్రం గట్టి ప్రయత్నమే కావాలి. సమయం కూడా చాలానే పడుతుంది. ఓర్పూ అవసరమే. ఎందువలనంటే ఇది ఒకరకంగా రివర్స్ ఇంజనీరింగ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here