“నీలి నీడలు” అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి, జాగృతపరుస్తారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది మొదటి ఖండిక ‘వరకట్నం‘.
వరకట్నం – ‘నీలి నీడలు” ఖండకావ్యంలోని మొదటి ఖండిక.
***
భారతదేశ సద్యశము బండలు చేయగ మానవుండుదా
ధీరతగోలుపోయి కడు తేజము గోల్పడి దుర్వినీతుడై
మేరను మీరు కోర్కెలతో మేదినిలో, ఘన మానవత్వమున్
దూరముజేసికొంచు తమితోడ దురాశను తాండవించుగా. 1
విలువలను వీడి మనుజుడు పలువిధాల
ధనమునార్జించుటే గొప్పతనమటంచు
అడ్డదారుల ద్రొక్కుచు నందుకొఱకు
తా దురాచారపరుడయ్యె ధాత్రియందు. 2
అన్ని దురాచారాలను
మిన్నయునై యణచబడకమేయంబగుచున్
ఎన్నో వ్యథలకు దండై
ఇన్నేలను కట్నభూత మెంతయొ యొసగెన్. 3
కన్నె సుంకంబులిచ్చెడి కాలమరిగి
మంచికాలంబు వచ్చెన్ మగువలకిక,
నంచుముదమందు చుండంగ నవనిజనులు
వింత వరకట్నముదయించి వేచసాగె. 4
వరకట్నంబది యంటురోగమగుచున్ వారాశి పర్యంతమున్
కరమున్బాధ రగిల్చి మానవులకున్ కష్టాల నందించియున్
వరకళ్యాణములందు ముఖ్యమగుచున్ వర్ధిల్లుచున్నిచ్చలున్
ధరలో స్త్రీలకు ఖేదమిచ్చి సతముందాపంబు గూర్చెన్ గదా! 5
ధనము కోట్ల కొలది ఘనముగా గలవారు
కాంక్ష యల్లురకును కాన్కలిచ్చు
నట్టి సంప్రదాయ మయ్యెను దుష్టమౌ
వరుని శుల్కముగను వసుధయందు. 6
ధనికులింట బుట్టి దర్జాల బొందుచు,
కట్న భూత మిపుదు కరుణ లేక
తినగ తిండి లేని జనముల యిండ్లలో
పాద మిడుచు, మిగుల బాధ గూర్చె. 7




