ఎవరు గొప్ప?

1
115

గత జన్మలో నేనేనేమో
అన్నట్లున్న
ఒక రెల్లుగడ్డి పోచల గుబురును చూస్తూ కూర్చున్నా.

ఓ బుల్లి నల్లముక్కు పిట్ట – గుప్పెడంత లేదు
నా తల చుట్టూ తిరిగి
రెల్లుపోచల మీద ఠీవిగా కూర్చుంది –
గాలి ఉయ్యాలలో ఊగుతూ.

ఏ ఊరు? ఏ దేశం? ఏ ఖండం?
అన్నట్లు చూశాను
గ్రహించిందేమో?!
రెక్కలు టపటప లాడించి
పైకెగిరి మళ్ళీ అక్కడే వాలింది
మిరియాల గింజలంత కళ్ళను మెరిపిస్తూ.

ఖండాలూ, దేశాలూ,
ఊళ్లూ, పేటలూ,
ఇళ్ళూ , గోడలూ,
ఆంతర్యాలూ, ఆంతరంగికాలూ,
అన్నీ మీకు.
మాదొక
విడదీయలేని సమూహం
అనిర్వచనీయ ఆనందం
నీలి ఆకాశమంత ప్రపంచంలో
స్వేచ్ఛని తాగి బతికే నిజమైన జీవితం మాది –
అన్నట్లు చూసింది.

దాని మాటలే నిజమన్నట్లు
ఏ వర్ణమూ లేని గాలి, పచ్చటి గడ్డి పోచలూ
ఊగి ఊగి నవ్వాయి.
ఏటిలో అలలు కదిలి వంత పాడాయి.

గుప్పెడంతే వున్న పిట్ట,
వూదితే ఎగిరిపోయే రెల్లు పోచలు,
చిరు గాలికే పరుగులు పెట్టే నీరు,
వేల వత్సరాల నాగరికత పెంచుకున్న
మనిషి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here