ఆకాశం నిర్ఘాంతపోయింది

0
111

గత అమావాస్య పూట..’సిరికోన’ లో విరిసిన గొలుసు కవిత వెన్నెల! – కూర్పు: డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ.
~
“ఆకాశం నిర్ఘాంతపోయింది
ఒడిలో దాచుకున్న
చందమామను
అమావాస్య ఎత్తుకెళ్లింద”ని..
గంగవరపు సునీత నకారాత్మక ఆక్రోశానికి
లేదు,లేదు, ” అమావాస్య ఎత్తుకెళ్లిన చందమామను తెచ్చి
ఒడిలో దాచుకొమ్మని ఇచ్చిన “పూర్ణిమ” ఔదార్యానికి….
ఆకాశం మురిసిపోయింద”ని పాలకుర్తి ఊరడింపు..
“ఒడిలోని చందమామ పుడమి పై జారి
వెన్నెల వాగై ప్రవహించిందం”టూ అత్తలూరి మైమరపు
” నీళ్ళకోసం కడవెత్తుకొచ్చిన కన్నెపిల్ల
ఆ వాగువెల్లువలో హాయిగా నవ్వుతూ
ఎటో కొట్టుకుపోయిందం”టూ ఆచార్య రాణీ పరవశింపు
“తీరం లేని వాగులో కొట్టుకుపోతున్న
పిల్లను పిలిచాడో పిలగాడ” ని శ్రీదేవీవేణూ కవ్వింపు..
“తనను తాను మరిచిందా పిల్ల..
పులకించిపోయింది నిలువెల్లా” నని సునీత మన్నింపు
” సిగ్గేసిన పిల్ల మబ్బు మాటునదాగి
నెలవంకలా చూసింది” అంటూ శ్రీముఖి జలదరింపు

ఇక లాభం లేదని
“వినిపించిన వేణునాదం
పుడమిన పూలతోటవగ
వలచిన వలపే వాగల్లే తోచి
విరిసిన కన్నులతో నింగిని వేడింది
తోడును ఇమ్మందం”టూ శ్రీదేవి ప్రియమైన అర్థింపు
“ఇక ఋతువులతో పనేముంది..
నీ హృదయం చాలందం”టూ సునీత సవరింపు
” కాలపు మేఘంతో కొంటె ప్రేమ కురిపించి
కవ్వింపుల పంట చేను పచ్చగా నవ్వింది”
అంటూ సుధామురళి స్వరం కలిపితే
“నిండిన మనసు బ్రతుకు పండింది
ఆకాశం వెన్నెలల్లే నవ్వింది” శ్రీదేవి పాటై పాడితే
దర్భముళ్ల చంద్రశేఖర్ ఊరకున్నారా?
“గుండెలలో గడ్డకట్టిన వలపు
కౌగిలిలో కరిగి గెలుపయిం”దంటూ దరువెయ్యలేదూ
“పచ్చంగ నవ్వినా చేను
కోరికలకు రెక్క తొడిగింది
మబ్బుల విహారమడిగింద” ని శ్రీదేవి బదులియ్యలేదూ!
“మాటకు తడబడిన దరహాసం
మమకారపు రెప్పలపై సేద తీరింది
ఆశ పడ్డ ఏ బాసో గుర్తుకు వచ్చింది
మురిపెంగా ఎద నిండా హాయి వచ్చి చేరిందం” టూ
సుధామురళి మాటపై మాట కలపలేదూ!
“గెలుపోటముల అలుపు తీరి మది
మౌనం కోరింద”ని వేణుకాంత ఊరడిల్లలేదూ
” దోచుకున్న నా నవ్వుని
నీ మౌనం తిరిగిచ్చింది
శ్వాసలతో ముడిపెడుతూ
తీపి గాయపు కబురందించింద”ని
మురళీసుధ ఉప్పొంగలేదూ!

అప్పుడు కదా రాణీ గారి ఆచార్య వచనం
“ఈ హడావిడికి ఉక్కిరిబిక్కిరైన రసచంద్రుడు
పిల్ల మోముమూసలో చేరి
ఆ ప్రేమ చల్లదనానికి గడ్డకట్టి
తన రూపం తనకొచ్చిందని ఆకాశం మధ్యలో
నవ్వులు రువ్వుతున్నాడ”న్న వ్యాఖ్యానం..
చంద్రశేఖరుని “ఒక ఆశ చిగురించి
ఒక శ్వాస చిందించి
ఒక బేల ఈ వేళ తనువెల్ల చుంబించగా…
ఒక మరుడు ఒక ప్రియుడు
తన తలపు సంధించి
కను కొలల బంధించి
చిగురుటధరమున చింతలను తగ్గించి
చిరుకలల చేదుకొను ఆమె చిత్రాంగిరా…
అతడు చిత్రరథుడు రా!” అనే కొత్త గానం!
దానితో -“ఆవిరైన కోరికేదొ.. తిరిగి రాజుకుంది
రేరాజుని ఒడిని చేరి సేదదీరుతోంది”అంటూ
సునీత సుధాకరనిమిత్తం గగనంకేసి చూసిన వైనం
” ఒక మనసు వివశమై
ఒక తనువు కల్పకమై
నడుమ ఓ రస స్పర్శ
ఇరు కదలికల కలయిక అయి
ఆతని తీరాలు ఆమె మనో నేత్రాలై
ఆమె పద భంగిమలు
ఆతని వలపు మలుపుల గమకాలై
అదో మమేక సరోవరం
ఏ భౌతిక రాజ్యమూ సరితూగని
ఆత్మ సంచార నందనవనం….
సంద్రపు ఒడ్డుపై వాలి రేరాజు
ఇసుము తారలతో ఆడుతున్న సరసం”
అన్న సుధామురళికి బదులుగా శ్రీదేవి
“వెలిగిన తార అలిగింది
వెన్నెలనెవరికీ పంచనంది” అంటే
పాపం, మొదలుపెట్టిన సునీతకు మతి పోయినట్లై
” ఏమిటో ఈరోజు..
ఓ చిన్న వానచినుకు
తుఫానై విరుచుకుపడింది
సిరికోనను తడిమి తడిపి ముద్దాడింద..”ని
మురిపెమో, నిట్టూర్పో తెలియకుండా కొసరింది
” గుండెలలో గడ్డకట్టిన వలపు
కౌగిలిలో కరిగి గెలుపయింది…..
కాదు కాదు విజయమైంది….
గెలుపు ఒకరిపై పొందేది…
విజయం సమష్టిగా పొందేద”ని
పాలకుర్తి పద్దుల పుస్తకం విప్పితే
“వలపున పోటీలేల
గెలుపోటముల వాదనేల
మనము మనమే కదా
విజయము మనదే కదా
ప్రణయరణమున” అంటూ శ్రీదేవి ముక్తాయించేసింది..
అలా ముక్తాయిస్తానంటే ఊరుకొంటుందా సుధాకవనం
” చిటపటల చినుకులన్నీ సంద్రపు చెలికత్తెలే
మేఘాల పల్లకీపై ఎన్నాళ్ళు ఊరేగినా…” అని రాగం తీసింది
” ఎవరెక్కడ ఊరేరినా
ఏరును ఈదాల్సిందే
చెలిమి కొరకు సంద్రమైన
చేతులు సాచాల్సిందే” అని సునీత తన వరస వదలనంది
ఇక అప్పుడు “అలసిన చందురూడు అటకెక్కాడు
జోలాలి పాటలిక తనకు వద్దంటూ
నిదురమ్మ ఒడే తనకు ముద్దంటూ…” సుధాలాపనం
” అటక మీదికెక్కలేని ఆకతాయి
చిన్న సవరణ కోసం పక్కలో తడుముకొంటున్నాడ”ని లనా అంటే
“తడుముతూ తడుముతూ దొరికిందే తడవు దొరకబుచ్చాడు
వెన్నెలలు చిలికాడు” అని శ్రీదేవి కొసరు కలిపింది…

” ఇందరు దిగ్గజాల దీవెనలతో
ఇవ్వాళ ఎంతందంగా సింగారించుకున్నావే సిరికూనా……
ఇలా వత్సరానికి ఒక్కరోజు చాలదా
మనసు నిండి గుండె పండడానికి!
పక్షానికొకసారి పక్ష్మాల ఒడ్డు పొడుగు తగ్గే
ఆ వెన్నెల పాటు ఇక మనకెందుకు…
అవసరమా ఇంత అమృతం తాగాక
అమవస లో ఆవులిస్తూ పోవడం
పున్నమితో పాడే విందుకు…??? ”
అంటూ దర్భముళ్ల “స్వస్తి!!!” వచనం!

అప్పుడు కదా
“వహ్వా…వహ్వా….
ఒకే ఆకాశం
ఒకే కేంద్రాంశం
దినుసుగా ఇరుసుగా
వనెవన్నెల నీటిని చిమ్మిన సిరిసిరిఫౌంటెయిన్
హరివింటిని కోన ఒంటిన
పులిమిన మిశ్రమాల షాంపేన్
అష్టదిగ్గజస్ఫూర్తి
సరిసిరికి పంపెన్
గొలుసుకవిత కొనగోట
రసానుభూతి వంపెన్” అంటూ
ఘంటశాల నిర్మలరస ప్రవచనం…
మొన్నపూట అనుకోకుండాసిరికోనలో
క్రొన్నెల బృందావన సందర్శనం
రస ఝరీ సమ్మోహ సమ్మేళనసంగీతం

కోనకదో మరపురాని రేయి
పూలగొలుసుకవిత అల్లిక హాయి
స్వరపరచి ఆచార్య రాణీవారు
పాడి భద్రపరచిన మధుర గానం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here